About Awards

TENA_Awards_Logo_300px

తేనా తెలంగాణ పునరుజ్జీవన గౌరవ పురస్కారాలు
(TeNA Honorary Awards for Telangana Renaissance)

సమాజ నిర్మాణానికి సాహిత్యం ఇంధనం వంటిదయితే సమాజపు రూపు రేఖల్ని యేర్పరిచి, మెరుగు దిద్దే యంత్రం లాంటిది సామాజిక కృషి. మనిషి ఉనికి చిరకాలం కొనసాగడానికి, సామాజిక పురోగతీ, శ్రేయస్సుల ఫలాలు ప్రతి మనిషికీ, ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజా శ్రేణులకు అందేలా చెయ్యడానికి, మానవతా విలువలు ఎల్లెడలా కాపాడడానికి, వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సుగా- సమాజ శ్రేయస్సు ప్రతి వ్యక్తి బాధ్యతగా సామాజిక న్యాయం కోసం తమ ఆలోచనలనూ ఆకాంక్షలనూ సాకారం చేసుకునేందుకు ఒక నిర్దిష్ట ఉద్యమ రూపం లోసామూహికంగానైనా వ్యక్తిగతంగానైనా చేసే కార్యాచరణే సామాజిక కృషి. సామాజిక శాస్త్ర పుటల్లో ఏ పాంత చరిత్రకూ తీసి పోనిది మన చరిత్ర, అందులోనూ గత ఆరు దశాబ్దాలుగా ఆత్మగౌరవం కోసం సాగిస్తున్న ఉద్యమ చరిత్ర మన మన తెలంగాణా చరిత్ర. మన తెలంగాణా సమాజంలో, సామాజిక పురోగతీ, సమాజ శ్రేయస్సు కొరకు , అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కోసం, ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై అహరహం కృషి చేస్తున్న యెందరో వ్యక్తులూ, సమూహాలూ సంస్థలూ ఉన్నాయి. హిమవన్నగం లాంటి ఆ సామాజిక కృషిని ఉడతా భక్తిగానైనా గుర్తించి గౌరవించాలని తేనా భావిస్తున్నది. అట్లా తెలంగాణ సామాజిక నిర్మాణంలో భాగం పంచుకోవాలని అనుకున్నది.

ప్రాచీన నాగరిక సమాజాలైన ఆదివాసీ తెగల మొదలుకొని మార్పును కోరి తోసుకువచ్చిన యూరోపియన్ ఆధునిక పునరుజ్జీవన కాలాన్ని దాటి స్థల కాల పరిస్థితుల నిర్దిష్టతలతో తమవైన విలువలను పునర్నిర్వచించుకుంటున్న తెలంగాణా వంటి ప్రాంతాల వరకూ సాహిత్య కళారంగాలే, సామాజిక ఉద్యమాలు గా ఆయా జాతుల చరిత్ర గమనాన్ని నిర్ధారించడం లో ప్రధాన భూమికలైనవి. ప్రస్తుతం తెలంగాణ ఆస్తిత్వ ఉద్యమ దశ దిశ ను నిర్దేశిస్తున్న పాటలు, కవితలతో జనం ఆకాంక్షలకు ఉపిరులూదిన ఎంతో మంది కవులూ , కళాకారులూ ఇందుకు మంచి ఉదాహరణలు. అంతర్గత, బహిర్గత వలస పాలకుల అణచివేతల్లో తగిలిన గాయాలు గేయాలై, స్థానికుల వెతలన్నీ కథలై, తెలంగాణా ఆకాంక్షల పతాకాలై సాగుతున్న ప్రస్తుత నేపథ్యంలో తెలంగాణా నవతరం ఆలోచనలకూ, సృజనాత్మకతకూ తగినంత గౌరవమూ, చేయూత యివ్వడం వల్ల అనేకానేక సంఘర్షణల్లోంచీ, ఉద్యమాల్లోంచి పుట్టిన గొప్ప ప్రపంచ రచయితల, ఉద్యమకారుల, సామాజిక శాస్త్రవేత్తల సరసన నిలబడదగిన స్ఫూర్తిని తెలంగాణా రచయితలకూ కళాకారులకు, తెలంగాణా పౌర సమాజానికి సేవ చేసే ప్రతి ఒక్కరికి కల్గించే ఉద్దేశ్యం తో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన సందర్భాన్ని కూడా వినియోగించుకొని, 2014 మొదలు తెలంగాణా ఎన్నారై అసోసియేషన్ (తేనా) ప్రతి యేటా సాహిత్య కళా శాస్త్ర లఘుచిత్ర పత్రికా రంగాల్లో విశిష్ట కృషికి పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది.

గౌరవప్రదమైన నగదు మొత్తంతో పాటు జ్ఞాపిక, యోగ్యతా పత్రాలు పురస్కార గ్రహీతలకు తేనా, తేనా తెలంగాణ పునరుజ్జీవన గౌరవ పురస్కారాలలో భాగంగా ప్రతి యేటా ఇస్తుంది. తెలంగాణా మేధావులు, రచయితలు, సాహితీవేత్తలు మరియు సామజిక కార్యకర్తలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు.

బి నర్సింగరావు, ఘంటా చక్రపాణి, ఆల్లం నారాయణ, విమల కటికనేని, ఆమ్మంగి వేణుగోపాల్, వేణు సంకోజు, దేవకీ తిరునగరి, తస్నీమ్ జోహార్ సలహా సంఘం సభ్యులుగా వ్యవహరిస్తారు.

తేనా సభ్యులు నారాణస్వామి వెంకటయోగి, వెంకట్ మారోజు, అమర్ కరిమిల్ల, శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి, హరికృష్ణ వంగల కార్యక్రమ అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు.

యోగ్యత :

ఈ పురస్కారాలకు తెలంగాణా మూలాలున్న,  తెలంగాణ లో పుట్టి తెలంగాణ లో నివసిస్తున్నవారూ, తెలంగాణా మూలాలుండి, తెలంగాణాలో పుట్టి  యితర ప్రాంతాలలో నివసిస్తున్నవారు మాత్రమే అర్హులు. దరఖాస్తుదారు తల్లిదండ్రులు కూడా తెలంగాణవారే అయి ఉండాలే. ఈ విషయాలన్ని ధృవీకరించ వలసిన భాద్యత దరఖాస్తుదారులదే.

పురస్కారం:

గౌరవప్రదమైన నగదుమొత్తం రూ. 50,000 లతో పాటు జ్ఞాపిక, యోగ్యతా పత్రాలతో చిరు సన్మానం.

ఇతర వివరాలు:

  1. గత 10 సంవత్సరాలుగా చేసిన విశేష కృషిని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. ఒక వ్యక్తి / వ్యక్తులు / కమిటి / సంస్థ / జీవితకాల కృషిని కూడా దృష్టిలో ఉంచుకొని పురస్కారాన్ని ఇవ్వవచ్చు.
  2. మరణించిన వ్యక్తి /వ్యక్తులు కూడా పురస్కారానికి అర్హులే.
  3. యోగ్యమైన దరఖాస్తులు రాని పక్షంలో పురస్కారాన్ని నిలిపివేసే హక్కు, పురస్కారాన్ని ఒకరికంటే ఎక్కువ మందికి / సంస్థలకు పంచే హక్కు ‘పురస్కార’ కమిటీకి ఉంటుంది.
  4. పురస్కార పరిశీలనకు సమర్పించే గ్రంధం ఒకే రచయిత /రచయిత్రి రాసినదై ఉండాలి. లేదా లభ్యం కాని పూర్వ రచనలు /విశిష్ట సంకలనాలను కమిటీ పరిగణలోకి తీసుకోవచ్చు.
  5. దరఖాస్తుల రూపంలో అందినవాటినే కాక ‘కమిటీ’ స్వయంగా ఇతర సంస్థల ద్వారా, వ్యక్తుల ద్వారా కూడా అవార్డులకు యోగ్యులైన వారి వివరాలను సేకరించి పరిశీలిస్తుంది.
  6. యోగ్యులైన వ్యక్తి /సంస్థల గురించి తెలిసిన వారెవరైనా పురస్కార యోగ్యుల తరపున వివరాలు పంపవచ్చు.   పురస్కార కమిటి వారి సూచనలను పరిశీలిస్తుంది.
  7. మీ దరకాస్తుతో పాటు జతపరిచిన ప్రతులు (పుస్తకాలు/సీడీలు/డీవీడీలు/ఫోటోలు ఇతరాత్ర ఆధారాలు) ఏవీ తిరిగి పంపడం సాధ్యం కాదని మనవి.

I.   కాళోజీ నారాయణరావు పురస్కారం :

తెలంగాణ సాహిత్యరంగంలో – కథ, కవిత్వం, నవల, నాటకం, నాటిక, విమర్శ ప్రక్రియల్లో  గత 10 సంవత్సరాల మధ్యకాలంలో మొదటిసారి ప్రచురించబడిన అత్యుత్తమ రచనకు ఇవ్వబడుతుంది. దరఖాస్తుదారులు తమ బయోడేటాను, పురస్కార కమిటీకి తెలుపదలిచిన ఇతర అంశాల వివరాలను జతపరిచి గ్రంధం యొక్క 3 ప్రతులను పోస్టు ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపవలసి ఉంటుంది.

II.  చిందుల ఎల్లమ్మ పురస్కారం :

తెలంగాణ కళా సంస్కృతిక రంగాలలో  గత 10 సంవత్సరాల మధ్యకాలంలో అత్యుత్తమ కృషి చేస్తున్నవ్యక్తులు ఈ పురస్కారానికి అర్హులు. జానపద కళాకారులు, వాగ్గేయకారులు, చిత్రలేఖకులు, నాట్యకారులు, శిల్పులు, పురస్కార కమిటీ అమోదించే యితర కళల్లో ప్రవీణులు మరియు తెలంగాణ కళా సాంస్కృతిక రంగాలను గూర్చి సాధికార గ్రంధాలు రచించిన వారు ఈ పురస్కార పరిధిలోకి వస్తారు.

కళాకారులూ /గ్రంధకర్తలు తమ బయోడేటా తో పాటుగా ఆల్బం ప్రతులు,సిడీలు ,డివీడి లు,  పత్రికా వ్యాసాలు, పొందిన అవార్డులు /గుర్తింపుల వివరాలు, కమిటీ దృష్టికి సమర్పించవలసి ఉంటుంది.

III. ప్రొ. జయశంకర్ పురస్కారం :

తెలంగాణ సామాజిక రంగంలో అత్యుత్తమ పరిశోధనకు/ఆవిష్కరణకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. గత 10 సంవత్సరాల మధ్యకాలంలో చేసిన పరిశోధన/ఆవిష్కరణ విద్యా సంబంధితంగా గానీ (academic); సంస్కరణాత్మకంగా గానీ (reformative) వృత్తి పరంగా గాని (professional) ఉండవచ్చు.

దరఖాస్తుదారులు తమ బయోడాట తో పాటుగా తమ కృషి కి సంభందించిన వివరాలు,పరిశోదక వ్యాసాలూ,పొందిన అవార్డులు /గుర్తింపుల వివరాలు కమిటీ దృష్టి కి సమర్పించవలసి ఉంటుంది . ఇవి ఏవీ తిప్పి పంపడం సాధ్యం కాదని మనవి .

IV. కొమరం భీం పురస్కారం :

తెలంగాణ సామాజిక రంగంలో మార్పు (social change) కోసం, అణగారిన వర్గాల జీవితాల్లో అభ్యున్నతి కోసం గత 10 సంవత్సరాల మధ్యకాలంలో ఉద్యమించిన వ్యక్తి /వ్యక్తులూ /కమిటీ /సంస్థ గానీ, ఇతరత్రా ప్రజా ఉద్యమాల్లో పోరాట పటిమ చాటుకున్న వ్యక్తి /వ్యక్తులూ /కమిటీ /సంస్థ గానీ ఈ పురస్కారానికి అర్హులు.

అర్హుల బయోడాట తో పాటుగా వారి కృషికి సంబందించిన గుర్తింపుల వివరాలు,అనుబంధ సమాచారం(సిడీలు,ఆల్బం ప్రతులు,వ్యాసాలు  మొ,) కమిటీకి సమర్పించవలసి ఉంటుంది. ఇవి ఏవీ తిప్పి పంపడం సాధ్యం కాదని మనవి.

V. పైడి జయరాజ్ పురస్కారం:

తెలంగాణా సామాజికరంగంలో మార్పు (సోషల్ చేంజ్) కోసం, అణగారిన వర్గాల జీవితాలలో అభ్యన్నతికోసం లఘుచిత్ర నిర్మాణం చేసిన నిర్మాత ఈ పురస్కారానికి అర్హులు. నూతన సృజనాత్మక ప్రతిభను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. చిత్ర నిడివి 10 నిముషాలు లేదా అంతకు ఎక్కువ ఉండవచ్చు. ప్రత్యేక సందర్భాలలో నిడివి విషయంలో సడలింపుకు అవకాశం ఉంటుంది. సీడీ / డీవీడీ / స్రిప్ట్ ఇతర సంబంధిత ఆధారాలు కమిటీకి సమర్పించవలసి ఉంటుంది.

VI. షోయబుల్లాఖాన్ పురస్కారం:

తెలంగాణ సామాజికరంగంలో అభ్యున్నతికి, తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రికేయ పాత్ర మొదలయిన వివరాలు, బయోడేట, పత్రికా వ్యాసాలు, ప్రచురణలు, పాత్రికేయ రచనలు, పుస్తాకాలు, సీడీలు/డీవీడీలు ఇతర ఆధారాలు సమర్పించవలసి ఉంటుంది.

VII. సురవరం  ప్రతాపరెడ్డి పురస్కారం :

కొత్త రచయితలను ప్రోత్సహించే పబ్లికేషన్ గ్రాంటు ఈ పురస్కార పరిధిలోకి వస్తుంది. గత 10 సంవత్సరాల మధ్యకాలంలో చేసిన కృషిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి  జీవితకాల కృషిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇంతకు మునుపు ప్రచురణకు నోచుకోని వారి రచనలను పరిగణలోకి తీసుకునే హక్కు కమిటీ కి ఉంటుంది. ప్రధమ ప్రాధాన్యత దృష్ట్యా  పురస్కార పరిశీలనకు సమర్పించే గ్రంధం ఒకే రచయిత రాసినదై ఉండాలి. లేదా లభ్యం కాని పూర్వ రచనలు /విశిష్ట సంకలనాలను కమిటీ పరిగణలోకి తీసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ బయోడాట తో పాటుగా ప్రకటించ దలచిన తమ రచన  డిటీపి మానుస్క్రిప్ట్ ని కమిటీ కి (పోస్టు ద్వారా  కాని,ఆన్ లైన్ ద్వారా కాని) సమర్పించవలసి ఉంటుంది. ఇవి ఏవీ తిప్పి పంపడం సాధ్యం కాదని మనవి .

ప్రచురణ సహాయం ఎట్టి పరిస్థితులలో రూ. 50,000/- లకు మించదు. ప్రచురణ వ్యవహారంలో రచయిత బాధ్యత కూడా ఉంటుంది. తేనా సంస్థకు ప్రచురిత గ్రంధం 100 ప్రతులను రచయిత తప్పక అందజేయవలసి ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : అక్టోబర్ 31, 2015

దరఖాస్తు ఫారం ఈ క్రింది బట్టన్ ద్వారా పొందవచ్చు

Download Application Form
"Contact:
Phone: 9885937740
Email: tena.awards@gmail.com
Facebook: www.facebook.com/telanganaNRIassociation

దరకాస్తు ఫారం మరియు రచనల/ఆధార ప్రతులు పంపవలసిన చిరునామా:

TeNA Awards
Flat No. 310, Prudvi Block
My Home Nawadweepa
Madhapur, Hyderabad
Telangana, 500081"

TeNA Telangana Renaissance Awards 2014