తెలంగాణా ఎన్నారై అసోసియేషన్ (TeNA) కనెక్టికట్ రాష్ట్రంలోని హార్ట్ ఫోర్డ్ నగరంలోని బర్ పాండ్ స్టేట్ పార్క్ లో జూన్ 20 న తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 కి పైగా తెలంగాణా యెన్నారై లు పాల్గొని , తమ ఉత్సాహవంతమైన ఆట పాటలతో పండుగ వాతావరణాన్ని తలపించారు. తెనా ముఖ్య సలహా దారులు మనోహర్ రావు ఎర్రబెల్లి, కార్యదర్శి విక్రం రౌతు, బోర్డు సభ్యులు సునీల్ తరాల, ప్రసాద్ కడారి, సతీష్ అన్నమనేని, కమలాకర్ స్వామి, రామారావు ఎరబెల్లి, సిటీ కో-ఆర్డినే టర్స్ ధర్మారావు, రాకేశ్ వంగల,కరుణాకర్ సజ్జన, కృష్ణ కుంబం, సతీష్ గండ్ర తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగానూ వైభవంగానూ జరిగింది.

ముందుగా తెనా (TeNA) కార్యదర్శి విక్రం రౌతు మాట్లాడుతూ తెనా ద్వారా జరిపిన ఉత్సవాలు, సేవా కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యక్రమాల గురించి వివరించారు. మిగతా సభ్యులు తెలంగాణా ఉద్యమం గురించి, అమరవీరుల త్యాగాల గురించి, రాష్ట్ర యేర్పాటు, ప్రస్తుతం రాష్ట్ర గమనం, అభివృద్ది గురించి వివరించారు. తర్వాత తెనా సభ్యులు , తెలంగాణా సిద్దాంతకర్త కీ .శే . ప్రో || జయశంకర్ గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి తెలంగాణా రాష్ట్రీయ గీతాన్ని ఆలపించారు. చిన్నారుల చేత కేక్ కట్ చేయించి, యెన్నారైలు ఒకరికి ఒకరు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆ తరువాత పిల్లలకు, మహిళలకు, పురుషులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు.